రానున్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయవతి తెలిపారు. శుక్రవారం తన 65వ జన్మదినం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. 2007 మాదిరే ఉత్తరప్రదేశ్‌లో ఏకపక్ష విజయం సాధించి వచ్చే ఏడాది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా ఎన్నికలకు సన్నద్దమవుతున్నారని అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పాటించాల్సిన నియమాల్లో రాజీపడేది లేదని అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అధికారంలో వస్తే ప్రజలందరికీ కొవిడ్ వ్యాక్సిన్ ఉచితంగా పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రేపటి నుంచి అన్నిరాష్ట్రాల్లో ప్రారంభంకానున్న కరోనా వ్యాక్సిన్ పంపిణీని ఆమె స్వాగతించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు టీకాను ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా నిలుస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.